- షీటీమ్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల,వెలుగు: రెండు మూడు నెలల్లో రిటైర్ కావాల్సిన టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యప్రవర్తన ప్రవర్తించాడు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ హై స్కూల్ లో తెలుగు టీచర్ గా నరేందర్ పని చేస్తున్నాడు. గీతానగర్ హై స్కూల్ లో సోమవారం షీ టీం ఆధ్వర్యంలో ‘ మహిళ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కొందరు విద్యార్థినులు టీచర్ నరేందర్ కొద్ది రోజులుగా క్లాస్ రూమ్ లో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని షీ టీంకు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన జిల్లా షీ టీమ్ సిరిసిల్ల టౌన్ పీఎస్ లో టీచర్ నరేందర్ పై పోక్సో కేసు నమోదు చేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే షీ టీం 87126 56425 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో మహిళలకు, విద్యార్థినులకు అండగా జిల్లా షీ టీమ్ ఉంటుందని ఎస్పీ చెప్పారు.